ఉద్యోగులకు క్యాష్‌‌‌‌లెస్ ఓపీ ఇక ‘వెల్నెస్‌‌‌‌ సెంటర్ల’లోనే!

ఉద్యోగులకు క్యాష్‌‌‌‌లెస్ ఓపీ ఇక ‘వెల్నెస్‌‌‌‌ సెంటర్ల’లోనే!
  • అక్కడి నుంచి రిఫర్​ చేస్తేనే నెట్‌‌‌‌వర్క్ హాస్పిటల్స్ లో ఇన్​పేషెంట్లుగా చేరే చాన్స్​
  • ప్రైవేట్​ఆస్పత్రులతో పాటు నిమ్స్​కూ ఇదే రూల్ 
  • ఎమర్జెన్సీ అయితేనే నెట్​వర్క్​ హాస్పిటళ్ల లో నేరుగా క్యాష్ లెస్​ అడ్మిషన్ 
  • ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఓపీ, టెస్టుల కోసం నిర్ణీత చార్జీలు
  • న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ గైడ్ లైన్స్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

 హైదరాబాద్, వెలుగు: న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఎన్ఈహెచ్ఎస్) కింద క్యాష్ లెస్  ఔట్-పేషెంట్ వైద్య సేవలు ఇకపై వెల్​నెస్‌‌‌‌ సెంటర్లలో మాత్రమే అందనున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రాథమిక ఓపీ కన్సల్టేషన్లు, ల్యాబ్ పరీక్షలు, ఉచిత మందులను వెల్​నెస్‌‌‌‌ సెంటర్ల ద్వారా మాత్రమే క్యాష్ లెస్ గా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిమ్స్, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఓపీ, టెస్టుల కోసం లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్(సీజీహెచ్ఎస్) రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎమర్జెన్సీ సమయంలో మాత్రం వెల్​నెస్‌‌‌‌ సెంటర్లతో సంబంధం లేకుండా నేరుగా నెట్​వర్క్ హాస్పిటల్స్ కు వెళ్లినా.. క్యాష్ లెస్ అడ్మిషన్ పొందొచ్చు. ఈ మేరకు ఎన్ఈహెచ్ఎస్ గైడ్​లైన్స్ ప్రభుత్వం విడుదల చేసింది. 

33 జిల్లాల్లో 37 వెల్నెస్ సెంటర్లు.. 

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉద్యోగులకు ఓపీ సేవలను విస్తరించేందుకు ప్రస్తుతం నడుస్తున్న 12 వెల్నెస్ సెంటర్లకు అదనంగా మరో 25 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం సంఖ్యను 37కు పెంచనున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), నిమ్స్ పర్యవేక్షణలోని కన్వర్జెన్స్ మోడల్‌‌‌‌ లో టీచింగ్ హాస్పిటల్స్, జిల్లా, ఏరియా హాస్పిటల్స్ ప్రాంగణాల్లో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఇక్కడ సాధారణ రుగ్మతలతో పాటు మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్లు, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు, మందులన్నీ పూర్తి ఉచితంగా అందుతాయి.

నిమ్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఓపీకి సొంత ఖర్చులే.. 

ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా వెల్​నెస్‌‌‌‌ సెంటర్లకు వెళ్లి మాత్రమే క్యాష్​లెస్ ఓపీ కన్సల్టేషన్, రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు పొందాల్సి ఉంటుంది. వెల్నెస్ సెంటర్లలో అందుబాటులో లేని ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ల కోసం నిమ్స్ లేదా ఇతర ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లకు క్యాష్ లెస్ గా రిఫర్ చేస్తారు. అయితే నేరుగా నిమ్స్, కార్పొరేట్ లేదా ప్రైవేట్ నెట్‌‌‌‌వర్క్ హాస్పిటల్స్ కు ఓపీ సేవల కోసం వెళితే ప్రభుత్వం నుంచి ఎలాంటి క్యాష్‌‌‌‌లెస్ సదుపాయం వర్తించదు. ఆ కన్సల్టేషన్, టెస్టుల ఖర్చులను ఉద్యోగులే స్వయంగా చెల్లించుకోవాలి. కాకపోతే, ప్రైవేట్ హాస్పిటల్స్ తమ సాధారణ చార్జీలను కాకుండా, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(సీజీహెచ్ఎస్) నిర్ణయించిన నిర్దిష్ట ప్యాకేజీ రేట్లను మాత్రమే ఉద్యోగుల ఓపీ సేవల కోసం వసూలు చేయాల్సి ఉంటుంది.

ఎమర్జెన్సీలో నేరుగా అడ్మిషన్

నెట్​వర్క్ ఆస్పత్రిలో చేరి క్యాష్ లెస్ ట్రీట్​మెంట్  పొందాల్సిన (ఐపీ) సందర్భాల్లో వెల్​నెస్‌‌‌‌ సెంటర్ డాక్టర్ల ముందస్తు రిఫరల్ తప్పనిసరి. అయితే, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి ముందస్తు రిఫరల్ లేకుండానే నేరుగా నెట్‌‌‌‌వర్క్ హాస్పిటల్ లో చేరవచ్చు. హాస్పిటల్ యాజమాన్యం 48 గంటల్లోగా ట్రస్ట్‌‌‌‌ కు సమాచారం అందించి ప్రీ-ఆథరైజేషన్ తీసుకోవాలి. ఐపీ సేవల కోసం అక్టోబర్ 2025 నాటి సీజీహెచ్ఎస్ 1,816 ప్యాకేజీలను ప్రభుత్వం ఆమోదించింది. 

పే గ్రేడ్​ల వారీగా వార్డులు..

ఉద్యోగుల పే గ్రేడ్​లను బట్టి హాస్పిటల్ రూమ్ కేటాయింపులను నిర్ణయించారు. పే గ్రేడ్ 1 నుంచి 4 (స్లాబ్ -ఎ), పే గ్రేడ్ 5 నుంచి 17 (స్లాబ్- బి) ఉద్యోగులు, పెన్షనర్లకు సెమీ-ప్రైవేట్ వార్డులు, పే గ్రేడ్ 18 నుంచి 32 (స్లాబ్- సీ) వారికి ప్రైవేట్ వార్డులు కేటాయిస్తారు. ఉద్యోగి పైస్థాయి గదిని ఎంచుకుంటే ఆ అదనపు రెంట్‌‌‌‌ను వారే భరించాలి. లబ్ధిదారుల డేటాను ఐఎఫ్‌‌‌‌ఎంఐఎస్ ద్వారా ధ్రువీకరించి మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా క్యూఆర్ కోడ్ డిజిటల్ కార్డులను జారీ చేస్తారు. కొత్త కార్డులు ఇచ్చేవరకు ఎంప్లాయ్ లేదా పెన్షనర్ ఐడీ కార్డు ఆధారంగానే చికిత్స అందించాలని, కార్డు లేదన్న కారణంతో అడ్మిషన్ నిరాకరించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.